Friday, November 30, 2012

ఆవర్తనం


ఇవాళ   కూడా  మళ్లీ స్వాధీనం   అవుతావా....

ఆవర్తనం మళ్లీ  పునరావృతం ...జిల్లేడు  పత్రం  తీసుకొని పుణ్య  తీర్థం  కోసం  ఇప్పుడు వెతుకుతూ   బయలుదేరాలి .
ప్రవహించే  నది  ఇప్పుడు  ఎక్కడుంది ? నువ్వు  ఇంకిపోయేనట్లే అదికూడా ....!
ఎవరో  చేసిన  ఏడు జన్మల  పాపం   నిన్ను  వెంటాడక తప్పదు .

వర్ణనకు  అతీతంగా ఏక  రూపం  పొంది పర్వత  గుహలో  నువ్వుదాక్కొని
ప్రతి  కల్పం  లోను   ఇవే  గాధలు   రాసుకుంటావు .

ఎనిమిది  చక్రాల  ఇనుప రధం  నీ తరం  ఫై  నుంచి ముందుకు  వెళ్ళిపోతుంది.

శాపం  పోకుండా , పాప ప్రక్షాళన  లేకుండా ,  చీకటి గొలుసుల వలయం  లోనే  నీ  అనువంసికత  జన్యువు .
దేహం  నుంచి  దేహానికి  నువ్వు చివరిగా  చెప్తున్న  రహస్యం  ఏమిటి ?

జంబూ  ద్వీపం  లోని నవవర్షాలలో  భరత వర్షం  కర్మ క్షేత్రం.
ఆవర్తనం మళ్లీ  పునరావృతం ..
విముక్తి  చూపని  ఈ  చరిత్రకొక ప్రణామం .!


రాత్రి నువ్వూ-నిశబ్ధమూ

1
వాన రెక్కల కింద తడిసిన 
ఒంటరి గువ్వ నువ్వు .

2


నూనె లో వత్తి వేసి దీపం వెలిగించు . మూర వెడల్పు నీడ లో నీ నలుపు -తెలుపుల ఆత్మ పాల పిట్ట గూడు లా అల్లుకొని ఒక యుద్ధ మేఘం చూపిస్తుంది .వాన తుంపర పడుతున్నపుడు రాత్రి కొమ్మల్లో నీ శ్వాస గుమ్మాని వెతుక్కుంటూ అరుగులు లేని వీధి లో పరుగులు  పెడుతూ  తిరుగుతూనే ఉంటుంది ...ఏడు సముద్రాలు 'కాల చక్రం' లో నిన్ను పగలూ,రాత్రులూ ఇనుప కొక్కెం కు తగిలించుకొని కర్కశంగా ఈడ్చుకొంటుపోతూనే ఉంటాయి .నాలుగో అడవి లో నువ్వ్వొక నడి రాత్రి రాలిపోయే
 నక్షత్రానివి.


3

రాత్రి పెదవుల ఫై రాలుతున్న వెన్నెల మొగలి పూల పరిమళమై నిన్ను ఆవరిస్తుంది .
ఎడారి లో నువ్వు పొర్లి పొర్లి ఇసుక పొరలమధ్య దాహం తీరని దేహంలా అంతరిస్తావు .


4
కాలం రెక్కల కింద
నువ్వొక గతించిన గాయానివి.విన్పించని గానానివి.కన్పించని గమ్యానివి .
నువ్వు అంటే ఒక శూన్యం.